NewsFx

Fresh off the feed

మతం భ్రమపూరిత జలతారు తెర

మతం భ్రమపూరిత జలతారు తెర

కమ్యూనిస్టుల మతాన్ని విశ్వసించకపోయినా నమ్మేవారి విశ్వాసాన్ని హక్కుగా గుర్తిస్తారు

సురవరం సుధాకరరెడ్డి

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి

మతం పట్ల కమ్యూనిస్టుల వైఖరి కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు, విభిన్నసందర్భాలలో విపులంగా వివరించారు.హేతువాద వైఖరితో వుండేవారుగా కమ్యూనిస్టు లు, మతాన్ని విశ్వసించరు. విశ్వం దాని ఆవిర్భావం గురించి, భూమి దాని పుట్టు క, జీవుల పుట్టుక, మనిషి రూపం వరకు రూపాంతరం చెందటానికి లక్షల సంవత్సరాల సుదీర్ఘ పరిణామక్రమం వీటన్నింటిని, అందరం చదువుకున్నాం. కాని మతం మీద విశ్వాసం కలిగిన వారు, సైన్సు వేరు, జీవితం వేరు అనుకుంటారు. చదువుకున్న సైన్సు విజ్ఞానాన్ని స్కూలు భవనంలోనే వదిలేస్తారు. మరికొందరు దేవుడి ఉనికిపై అనుమానమున్నా, ఎందుకైనా మంచిదని మొక్కులకు పోతుంటారు.

మతాలు ఆవిర్భవించినపుడు సైన్సు అభివృద్ధి కాలేదు. మానవ మేధస్సు ఆలోచించటం ప్రారంభించిన తర్వాత మానవజాతి పుట్టుక గురించి జిజ్ఞాస ప్రారంభమైంది. అంతకుముందు ప్రకృతి వైపరీత్యాలకు భయపడి ప్రకృతిని ఆరాధించటం ప్రారంభించారు. భయంతో రక్షణ కోసం ఆరాధించేవారు. ఆ తర్వాత సృష్టికర్త ఎవరో వున్నారని ఆలోచన ప్రారంభమైంది. సృష్టికర్త భావన బలపడింది. దానిని ప్రచారం చేయడానికి మతం సృష్టించబడింది. “మనుషులు చేసిన దేవుళ్లారా, దేవుడు చేసిన మనుషుల్లారా,” అని పాపులర్ సినిమా పాట వుంది. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో వివిధ సందర్భాలలో భగవంతుడిని సృష్టించారు. దేవుడి రూపం అస్పష్టం. అనేక మతాలలో దేవుడి రూపాన్ని చిత్రించ నిరాకరిస్తారు. ఎవరైనా ప్రయత్నిస్తే ఆగ్రహిస్తారు. భారతదేశంలో వైదిక మతంలో మానవ రూపంలో భగవంతుడిని ఆరాధించటం ప్రారంభమైంది. భగవంతుల సంఖ్య పెరగటం ప్రారంభమైంది. 33 కోట్ల దేవతల రాజ్యం వారి రాజు దేవేంద్రుడు, స్వర్గం, నరకం, తదితరాల సృష్టి జరిగింది. మతం మీద, దేవుడి మీద నమ్మకంలేని వారిని భయపెట్టడానికి, విశ్వాసమున్న వారిని మరింతగా విశ్వాసం బలోపేతం చేయడానికి వీటిని సృష్టించారు. హంతకులు దొంగలు, హింసాప్రవృత్తి కలవారు, యుద్ధాలు చేసేవారు దేవుడికి మొక్కి తమ పని విజయవంతం కావాలని మొక్కులు చెల్లిస్తారు. జూదగాళ్లు తాము గెలవాలని దేవుడిని కోరుకుంటారు. దేవుడికి అర్పణ పేరుతో టెంకాయలనుండి నగదు, బంగారం దాకా చెల్లిస్తారు. ఈ ప్రపంచమే దేవుడుచే సృష్టించబడిందని నమ్మేవారు, దేవుడికి కానుకలెందుకని ఒక్క క్షణం ఆలోచించరు. దేవుళ్ల పేర్లు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వున్నట్లే, రూపాలు కూడా మారుతాయి. మానవ రూపంలో శిలా విగ్రహాలు, ఒరిస్సాలోని పూరిలో 12 సంవత్సరాల కొకసారి మార్చే చెక్క విగ్రహాలు వుంటే, ఆదివాసీలకు సంవత్సరానికొకసారి వచ్చే పండుగకు ఆలయంలోని చెట్టు కింద, రాళ్లు పెట్టి పసుపురాసి ప్రార్థించి జాతర చేసి పోతారు. వీరు కాక దక్షిణ భారతదేశంలో ప్రతిగ్రామంలో గ్రామ దేవతలుంటారు. వీరికి స్థానిక బహుజనుల నుండే పూజారులుంటారు. వైదిక మతంలో బ్రాహ్మణులే పూజారులు. ఇస్లామ్లో ఇమామ్లుంటారు. క్రైస్తవమతంలో ఫాదరీలు వీరందరిపైన పోప్ వుంటారు. క్రమంగా మతాలు బలోపేతమైనాయి. మతగురువులు రాజులు పరస్పర మద్దతుదారులు. తమ మతమే ప్రపంచ మంతా విస్తరించాలని యుద్ధాలు జరిగాయి. లక్షలమంది మరణించారు. నిజంగా భగవంతుడు సర్వశక్తిమంతుడైతే, అన్ని దేశాలలో ఒకే మతం వుండాలి. కొన్ని కొన్ని దేశాలకు ఒక మతం దేవుడు ఎందుకు పరిమితమౌతారు? ఈ ప్రశ్నలడుగుతే హేతుబద్ధమైన సమాధానాలివ్వలేక ఆగ్రహిస్తారు. దాడులు చేస్తారు. అవిశ్వాసుల తలలు నరుకుతారు.

మార్కు “మతం అణగదొక్కబడిన బాధాసర్పద్రష్టులైన ప్రజల కు ఓదార్పు నిట్పూర్పు” దశతో ప్రారంభమై “మతం మత్తు మందుగా మారుతుంది” అన్నాడు. మతం ఒక భ్రమపూరిత జలతారుతెర. కమ్యూనిస్టులు హేతుబద్దంగా, చైతన్యపూరితంగా ఆలోచిస్తా రు గనుక మతాన్ని విశ్వసించరు. నిరాకరిస్తారు.

దేవుడి గురించి, చెప్పని మతాలు కొన్ని వున్నాయి. అందులో బౌద్ధం ముఖ్యమైంది. యజ్ఞయాగాదులు లేని, లక్షల పశువుల బలి లేకుండా వుండే సమాజాన్ని, కులమత భేదాలు లేని సమాజాన్ని వాంఛించింది. చైనా, శ్రీలంక, భూటాన్, సిక్కిం, జపాన్, థాయిలాండ్, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర ఆసియా దేశాలలో అత్యధికులు బౌద్ధులే. మతాన్ని విశ్వసించక, దానిలోని లొసుగులు వివరించడం వేరు. మత అనుయాయులను ద్వేషించడం వేరు. కమ్యూనిస్టులు మతాన్ని విశ్వసించకపోయినా, మతాన్ని నమ్మేవారి విశ్వాసాన్ని వారి హక్కు గా గుర్తిస్తారు. అన్ని మతాలవారికి సమాన హక్కులుండాలని కోరుతారు. ఫలానా మతానికి అనుకూలం, ఫలానా మతానికి వ్యతిరేకం అనే ప్రసక్తి లేదు. మతం పేరుతో మోసగాళ్లను, ప్రజా వంచకులను బహిర్గతం చేస్తారు.

ఐతే కమ్యూనిస్టుపార్టీ సభ్యులందరు మతం నుండి దూరంగా, వ్యతిరేకంగా వుండాలనే నిబంధన లేదు. అలాంటి నిబంధన పార్టీ నిబంధనావళిలో చేర్చేందుకు లెనిన్ నిరాకరించాడు. ప్రజలు చైతన్యం ద్వారా విజ్ఞానవంతులు కావాలని ఆయన చెప్పారు.

కమ్యూనిస్టులు మతోన్మాదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అన్ని మతాలలో అత్యధిక ప్రజలు సాధారణ విశ్వాసులు. కొంతమంది వీరభక్తులు. మరికొంతమంది మతోన్మాదులు. సమస్య వీరితోనే. ప్రమాదం వీరితోనే. మతం ప్రమాదంలో పడిందని, ఇతర మతాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి జనాభా పెరిగి, మన జనాభా తగ్గుతుందని భవిష్యత్తులో వారే దేశంలో మెజారిటీ ఔతారని తప్పుడు ప్రచారం చేస్తారు. ప్రతి సమస్యను మత సమస్యగా ప్రజల మనుషుల్లో విషం ఎక్కిస్తరు. మత ఘర్షణలకు కారణమౌతారు. మతోన్మా దం పేర, శవాల గుట్టలు పేర్చి ఆ మెట్లమీద రాజ్యాధికారం పొందే ప్రయత్నం చేస్తారు. ఏ దేశంలోనైనా మెజారిటీ మతంలో మతోన్మాదం అత్యంత ప్రమాదకరం.

మతంతో ఏర్పాటయ్యే దేశాలు అభివృద్ధి చెందకపోగా, మరింత నష్టపోతాయి. ఉదాః పాకిస్తాన్, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. దుర్భర దారిద్య్రంతో, ఆకలితో, నిరుద్యోగంతో, టెర్రరిస్టు హత్యలతో, దేశం దివాళా తీస్తున్నది. దాదాపు 40 సం.లపాటు సైనిక పదఘట్టనల కింద నలిగిపోయింది. ఆప్ఘనిస్థాన్ మరింత దారుణంగా మతోన్మాద, మూర్ఖతాలిబాన్ల చేతిలో బ్రతుకుతున్నది. మతోన్మాదం ప్రజాస్వామ్యానికి, ప్రగతికి, విజ్ఞాన వికాసానికి, ఆఖరుకు సాధారణ విద్యకు వ్యతిరేకం. అందువల్లనే మతోన్మాదులకు వారి విద్వేష ప్రచారానికి యావన్మంది ప్రజలు పోరాడాలని కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది.

కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యం వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని, చైతన్యాన్ని పెంపొందించటం.

మతాన్ని నిందించటం కంటే హేతవాదాన్ని, శాస్త్రీయ విజ్ఞానా న్ని తద్వారా చైతన్యాన్ని పెంపొందించటం ముఖ్యం. ఈ మధ్య జరిగిన అంతర్జాతీయ సర్వేలో ప్రపంచంలో 110కోట్లమందికి పైగా మతాన్ని నమ్మని వారున్నారని తేలింది. ఇది చాలా పెద్ద సంఖ్య. వారు తమ చైతన్యం ద్వారానే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు.

నేరుగా మతంపైన, దాడి చేస్తే అది మరింత గట్టిపడుతుంది. దానిద్వారా ప్రయోజనం నెరవేరదు. అంధకారాన్ని వెలుగుద్వారానే బద్దలు కొట్టగలం. నేరుగా దాడి చేయకూడదంటే మేము దానికి వ్యతిరేకంగా కాదనే ప్రకటనల ద్వారా, కాదు. అది మన మానసిక స్థాయి దిగజారుడు ఔతుంది. వారి ఉచ్చులో పడకూడదు. పార్టీలో నాస్తికులై ఉండితీరాలని నిబంధనలేదు కాబట్టి, మనం దైవదర్శనాలకు, యజ్ఞాలకు, మతపరమైన కార్యకలాపాలలో భాగం కావడానికి లైసెన్సు కాదు. కమ్యూనిస్టులు హేతుబద్దం గా ఆలోచించి మతానికి, మతపర కార్యకలాపాలకు దూరం గా వుండాలి. సాధారణ కమ్యూనిస్టు సానుభూతిపరులు వేరు. పార్టీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు వేరు. ఒకసారి నాయకులు తప్పు చేస్తే, క్రింద స్థాయిలో అదొక సాకుగా, సాంప్రదాయకంగా మారుతుంది. అందువల్ల నాయకులు జాగ్రత్తగా వుండాలి.

కమ్యూనిస్టు పార్టీ అధికారంలో వుండిన, వున్న సోషలిస్టు దేశాలలో కూడా మత స్వేచ్ఛ ఉంది. సోవియట్లో పాత చర్చిలు, కెథెడ్రిల్స్, అన్నీ అలాగే వుండటమే గాక కొంతమంది ప్రార్థనలకు వెళ్లేవారు. బాకులో ఒక విశాలమైన మసీదును చూడటానికి వెళ్లాము. ఆ ఇమామ్తో కొంతసేపు చర్చించాం. మాకు స్వేచ్ఛ వుంది కాని, కొత్త తరం ప్రార్థనలకు రారు. విరాళాలివ్వరు. పాత వాళ్లు వస్తారు అన్నాడు. ఆయన మనుమడిని పరిచయం చేసాడు. యంఎస్సి చదువుకున్నాడు. మీరు ప్రార్థనలు చేస్తారా అని అడిగాం. నేను సైన్సు విద్యార్థిని, నేను భగవంతుడి ఉనికిని నమ్మను అన్నాడు. మాతో వున్న ఒక ముస్లిం మిత్రుడు “ఇవన్నీ మీకు కాలేజీలో నూరిపోస్తారా” అని అడిగాడు. ఆ యువకుడు కోపంగా మన పుస్తకాలలో రోజూ స్నానం చేయాలని, శుభ్రంగా వుండాలని ఏ పాఠ్యపుస్తకంలో ఉండదు. ఇది కూడా అలాంటిదేనన్నాడు.

చైనాలో బౌద్ధ ఆలయాలు అందంగా, విశాలంగా ఉన్నాయి. అవి ఆరాధ్య స్థలాలేకాక పెద్ద పర్యాటక కేంద్రాలుగా వున్నాయి. ఈ మధ్య కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలు గుళ్లు, దేవాలయాలు, దర్శిస్తున్నారు. అది సరైంది కాదు. అది అశేష వామపక్ష ప్రజానీకానికి మంచి సందేశం పంపదు. కమ్యూనిస్టులుగా చైతన్యం పెంచుకోవాలి.ప్రజలను చైతన్యపర్చాలి. అది మన కర్తవ్యం.

Sources

From the MediaFx archive.