
తెలంగాణ వైతాళిక తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి - రాష్ట్ర మంత్రులు 🙏🙏🙏

హైదరాబాద్ : తెలుగు భాషకు, తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేసిన త్యాగధనులు. తెలంగాణలో భాషా, సాంస్కృతిక, సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ వైతాళిక తేజోమూర్తి సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక చరిత్రకారుడు, రచయిత, కవి, పండితుడు, సంపాదకులు సురవరం ప్రతాప రెడ్డి 127 వ జయంతి సందర్భంగా మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు ఆదివారం హైదరాబాద్, ట్యాంక్ బండ్ పై ఉన్న సురవరం ప్రతాప రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, సామాజిక వేత్తaలను గుర్తించి వారి జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. వారు అందించిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియచెప్పేలా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని మంత్రులు వెల్లడించారు. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేసిన సురవరం రచనలను భవిషత్తు తరాలకు అందించవలసిన అవసరం ఉందని అన్నారు. ఆ మహానీయుని ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు డా. ఎల్లూరి శివ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కార్యదర్శి సురవరం పుష్పలత రెడ్డి, కోశాధికారి డా. సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు సురవరం విష్ణువర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.

Sources
From the MediaFx archive.
