NewsFx

Fresh off the feed

సురవరం ప్రతాపరెడ్డి జీవిత చర్రిత నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది :మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

సురవరం ప్రతాపరెడ్డి జీవిత చర్రిత నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది :మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: సురవరం ప్రతాపరెడ్డి అడుగుజాడల్లో నడిస్తే గొప్ప వ్యక్తులుగా మారుతారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జీవిత చర్రిత నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రవీంధ్రభారతిలో ‘సురవరం ప్రతాపరెడ్డి ’ నాటకాన్ని ప్రదర్శిస్తామని, ఈ నాటకానికి మంత్రులు, ఎమ్మెల్యేలను, ముఖ్యులను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి 127వ జయంతి సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆదివారం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు డా. ఎల్లూరి శివారెడ్డి సభాధ్యక్షత వహించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కార్యదర్శి సురవరం పుష్పలత రెడ్డి, కోశాధికారి డా. సురవరం కృష్ణ వర్ధన్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు సురవరం విష్ణువర్ధన్ రెడ్డి, సురవరం అనిల్ కుమార్ రెడ్డి సురవరం కపిల్, చరిత్ర పరిశోధకులు శివనాగిరెడ్డి తదితరులు వేదికపై ఆసీనులైనారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ప్రతి ఏటా అందజేసే సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి సాహిత్య పురస్కారాన్ని-2023 ప్రముఖ తెలుగు సాహితీ వేత్త కసిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బహుకరించారు. పురస్కార పత్రం, జ్ఞాపికతోపాటు లక్ష రూపాయల నగదు ను మంత్రి అందహీసారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి రాజకీయాల్లోనే కొనసాగి ఉంటే సమాజంలో పెనుమార్పులు వచ్చేవని, గొప్ప సంస్కరణలను ప్రవేశపెట్టేవారని, అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. సురవరం ప్రతాప రెడ్డి దేశానికి, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన వ్యకి అని కొనియాడారు. సురవరం అంటే సిఎం కెసిఆర్కు అపారమైన గౌరవం ఉన్నదన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, సురవరం ప్రతాపరెడ్డి, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్యలాంటి మహానీయులు సమాజంలో మార్పులు జరగాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, విలువలతో బతకాలని ప్రతి క్షణం తపించారని కొనియాడారు. అలాంటి మహానీయులను కొందరు కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధకరమన్నారు. సురవరం ప్రతాపరెడ్డి ఎవ్వరికీ భయపడకుండా తన పుస్తకాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి నాటకం ఎంతో మందికి ప్రేరణ అని అన్నారు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం నేటి రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిందని మంత్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. డా ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్తాన్ని విజ్ఞప్తి చేశారు. సురవరం ప్రతాపరెడ్డి రాసిన “ఆంధ్రుల సాంఘీక చరిత్ర’ కు మించిన గ్రంథం మరోటి లేదన్నారు. ఆయన గొప్ప పండితుడని కొనియాడారు.

Sources

From the MediaFx archive.